tsrtc: ఆర్టీసీ విలీనం చేపట్టేవరకు సమ్మె కొనసాగుతుంది: స్పష్టం చేసిన అశ్వత్థామరెడ్డి

  • ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు రాలేదు
  • ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
  • సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ, చెన్నై నుంచి కార్మికులు వస్తున్నారు

చర్చల కోసం ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటివరకు పిలుపు రాలేదని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని టీఎంయూ కార్యాలయంలో ఈ రోజు ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఇందులో పలు విషయాలపై చర్చించిన అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేపట్టేవరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అప్పటివరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి పునరుద్ఘాటించారు. తాము కొనసాగిస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ, చెన్నై నుంచి కూడా కార్మికులు వస్తున్నారని ఆయన వివరించారు. మరోవైపు, ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. బస్సులు పూర్తి స్థాయిలో నడిచేలా చేయాలని అన్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింత విస్తృతం చేయాలని ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News