Dalailama: అతిగా ఆవేశపడొద్దు... పాక్ ప్రధానికి హితవు పలికిన దలైలామా
- దృక్పథం మార్చుకోవాలని సలహా
- వాస్తవికత అలవర్చుకోవాలన్న దలైలామా
- ట్రంప్ పైనా వ్యాఖ్యలు
టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా భారత్, పాకిస్థాన్ సంబంధాలపై స్పందించారు. ఉపఖండంలో శాంతి కోసం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన దృక్పథం మార్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. వాస్తవిక దృష్టితో ఆలోచించడం అలవర్చుకోవాలని సలహా ఇచ్చారు. ప్రతి అంశాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టడం పాక్ ప్రధాని సహా ఇతర వేర్పాటు వాదులు మానుకోవాలని హితవు పలికారు.
"ఐక్యరాజ్యసమితిలో భారత, పాకిస్థాన్ ప్రధానుల ప్రసంగాల్లో ఓ తేడా ఉంది. భారత ప్రధాని శాంతి గురించి మాట్లాడితే, అందుకు భిన్నంగా పాక్ ప్రధాని ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. చైనా ప్రాపకం సంపాదించాలన్నదే పాక్ ఉద్దేశం. కానీ పాకిస్థాన్ కు భారత్ తోనూ అవసరం ఉంది. అందుకే పాక్ నేతలు సంయమనం పాటించాలి. ముఖ్యంగా పాక్ ప్రధాని భావోద్వేగాలు నియంత్రించుకుని మాట్లాడాలి" అని వ్యాఖ్యానించారు.
పాక్ ప్రధాని మాత్రమే కాదని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మితిమీరిన భావోద్వేగాలు ప్రదర్శిస్తుంటాడని దలైలామా విమర్శించారు. "సిరియా విషయంలోనే చూడండి! అమెరికా అధ్యక్షుడు అతిగా ఆవేశపడి సిరియా నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ అవకాశాన్ని టర్కీ అధ్యక్షుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇది చాలా బాధాకరం" అని పేర్కొన్నారు.
సిరియాలో తమ సైన్యం ఇక పోరాడబోదని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో టర్కీదళాలు ఇదే అదనుగా సిరియాలో ప్రవేశించడం తెలిసిందే. సిరియాలో శాంతి కోసం పోరాడుతున్న కుర్దు దళాలను లక్ష్యంగా చేసుకుని టర్కీ దళాలు ముందుకు దూసుకెళ్లాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా ప్రపంచదేశాలను బ్లాక్ మెయిల్ చేసే రీతిలో బెదిరింపులకు దిగారు. ఈ పోరులో మాతో కలిసి వస్తారా? లేక లక్షల్లో ఉన్న శరణార్థులను మీ దేశాల్లోకి పంపించమంటారా? అంటూ స్వరం మార్చారు.