snake: ఆ ఏడు తలల పాము పొర నిజం కాదంటున్న నిపుణులు.. గుడి కట్టేందుకు సిద్ధమైన భక్తులు!
- ఓ రైతు పొలంలో లభించిన పాము పొర
- ఏవరో కావాలని చేసిన గిమ్మిక్కు అంటున్న నిపుణులు
- పామును తాను చూశానంటున్న పొలం యజమాని
కర్ణాటకలో ఇటీవల లభ్యమైన ఏడు తలల పాముకు సంబంధించిన పొర చుట్టూ వివాదం నెలకొంది. కనకపుర తాలూకాలోని మరిగౌడనదొడ్డిలో ఓ పొలంలో కనిపించిన ఈ పాము పొరపై రోజుకో వార్త వినిపిస్తోంది. ఈ పొరను చూసిన ప్రజలు.. పురాణాల్లో చెప్పే ఏడు తలల పాము నిజంగానే ఉందన్న నిర్ధారణకు వచ్చి దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే అక్కడ నాగప్రతిష్ఠ చేసిన భక్తులు.. దేవాలయ నిర్మాణం కోసం సిద్ధమవుతున్నారు.
ఏడు తలల పాముపొర లభించిందన్న విషయం దావానలంలా వ్యాపించడంతో దానిని చూసి పూజలు చేసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. విషయం వన్యప్రాణుల సంరక్షణ అధికారులకు చేరడంతో తాజాగా వారొచ్చి ఆ పొరను పరిశీలించారు. అది ఏడు తలల పాము పొర కాదని తేల్చి చెప్పారు. ఎవరో కావాలే కొన్ని పాము పొరలను అతికించి అలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏడు తలల పాములు లేవని, ఒకవేళ పుట్టినా బతికే అవకాశం లేదని స్పష్టం చేశారు.
అధికారుల వాదనను పాము పొర లభించిన భూమి యజమాని మరికెంపేగౌడ కొట్టిపడేశాడు. ఏడు తలల పాము తిరగడాన్ని తన కళ్లతో తాను చూశానని చెబుతుండడంతో ఎవరి వాదన నమ్మాలో తెలియక భక్తులు అయోమయానికి గురవుతున్నారు.