Srikakulam District: అరెస్ట్ చేసిన భర్తను వదిలేశారట.. పోలీస్ స్టేషన్‌పైకి రాళ్లు రువ్వి మహిళ హంగామా
- శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఘటన
- పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నానా రభస
- హోంగార్డుపై చేయి చేసుకున్న వైనం
భార్య ఫిర్యాదుపై భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత అతడిని వదిలిపెట్టారు. విషయం తెలిసిన మహిళ రెచ్చిపోయింది. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వీరంగమేసింది. రాళ్లతో పోలీస్ స్టేషన్ కిటికీ అద్దాలు పగలగొట్టింది. స్టేషన్ బయట ఉన్న వాహనాల అద్దాలను బద్దలుగొట్టింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. పాతపట్నానికి చెందిన వందనాదేవి, భవానీపురానికి చెందిన నాగరాజు భార్యాభర్తలు. గత కొన్నేళ్లుగా వీరిమధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల ఇవి తారస్థాయికి చేరుకోవడంతో ఆమె టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు నాగరాజును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారు.
అయితే, నాగరాజును స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు విచారణ అనంతరం వదిలిపెట్టారు. విషయం తెలిసిన వందనాదేవి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నానా రభస చేసింది. రాళ్లు విసిరి స్టేషన్ అద్దాలు బద్దలుగొట్టింది. ఆవరణలో ఉన్న పోలీసు వాహనాలపైనా రాళ్లతో దాడిచేసింది. అంతటితో ఆగక రోడ్డుపై బైఠాయించి నానా హంగామా చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా ఓ హోంగార్డుపై చేయి చేసుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.