Afghanistan: మేము భారత్ కు వ్యతిరేకం కాదు: తాలిబాన్ నేత మహమ్మద్ సుహైల్ షహీన్

  • ఆఫ్ఘనిస్తాన్ పునర్ నిర్మాణంలో భారత్ సహాయం కావాలి
  • అమెరికా చర్చలు ఆపేయకుంటే.. దేశంలో శాంతి నెలకొనేది
  • అన్ని దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడమే మా విధానం

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడినప్పటికి.. తాలిబాన్ నీడ వెంటాడుతూనే ఉంది.  ఇటీవల యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్లతో సంప్రదింపుల ప్రక్రియకు తిలోదకాలివ్వడంతో తాలిబాన్లు మరోసారి అటు ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని,  ఇటు ట్రంప్ వైఖరిని తప్పు పడుతున్నారు.   ఆఫ్ఘన్ పునర్మిర్మాణానికి భారత్ సహకరించాలని తాలిబాన్లు కోరుకుంటున్నారు. సోమవారం తాలిబాన్ అధికార ప్రతినిధి మహ్మద్ సుహైల్ షహీన్ సీఎన్ఎన్ న్యూస్ చానల్ కిచ్చిన  ఇంటర్వ్యూలో  పలు అంశాలు వివరించారు.

ఇంటర్వ్యూ విశేషాలు....

అమెరికా తన శాంతి చర్చలు నిలిపివేసింది. మళ్లీ చర్చలు పునరుద్ధరిస్తుందని మీరు ఆశిస్తున్నారా ? ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి తిరిగి నెలకొంటుందని భావిస్తున్నారా?

సైనిక చర్య ద్వారా  ఎలాంటి పరిష్కారం దొరకదు. ఇది అమెరికన్లకు భాగా తెలుసు. ఎందుకంటే గత 18 ఏళ్లుగా వారు సైనిక చర్య విధానాన్ని అవలంబించినప్పటికి.. ఫలితం రాలేదు. కాబట్టి శాంతి మార్గంలో చర్చల ద్వారా పరిష్కారం పొందటమే మనముందున్న మంచి అవకాశం. వారు శాంతి  ఒప్పందం చేసుకోవడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. లేకపోతే.. వారి మొండి వైఖరితో మరోసారి చేదు ఫలితాన్ని పొందుతారు.

తాలిబాన్, అమెరికన్ సైనికుడిని చంపిన తర్వాతే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల ప్రక్రియను నిలిపేశారు. ఇది మీ చర్చల ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుందనుకుంటున్నారా ? ట్రంప్ ఆరోపణల పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు?

ఒకవేళ అదే నిజమైతే.. వారు మాకు వ్యతిరేకంగా దాడులకు  ఎందుకు తెగబడ్డారు ? వారి దాడులు శాంతి చర్చలకు మార్గం సుగమం చేస్తుందా ? వారు దాడులు ప్రారంభించారు. మేము వాటికి బదులిచ్చాం. అవి చర్చలకు  ప్రతిబంధకం అవుతాయని నేను అనుకోవడంలేదు. వారు మా ప్రాంతాలపై చేశారు. వాటిల్లో మా మనుషులు, పౌరులు మరణించారు. ప్రతిగా మేము దాడులు చేశాము. అంతే.. అప్పుడు కాల్పుల విరమణ లేదు. కాల్పుల విరమణ శాంతి  ఒప్పందం తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ఇప్పటివరకు జరుగలేదు. ఈ ప్రక్రియను తక్షణమే అమెరికా ప్రారంభించాల్సి ఉంది.

అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ఆఫ్ఘన్ ప్రభుత్వం దోహ శాంతి చర్చల్లో జోక్యం చేసుకోలేదు. దేశంలో  ఎన్నికల తర్వాత ప్రస్తుతం.. ప్రభుత్వం బలోపేతం అయిందనుకుంటున్నారా ?

మేము కాబుల్ పరిపాలనలో  చేరలేదు. ఎందుకంటే.. ఆఫ్గన్ సమస్యను మేం రెండు కోణాల్లో చూస్తున్నాము. మొదటిది బహిర్గత సమస్య. అమెరికన్లు ఆఫ్ఘన్ భూభాగం నుంచి తమ బలగాలను ఉపసంహరించడం. అంతేకాక, వారు, వారి మిత్ర దేశాలు మా దేశ భూభాగాన్ని ఉపయోగించకూడదు. ఎప్పుడైతే  ఇది జరుగుతుందో అప్పుడే శాంతి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. రెండో సమస్య అంతర్గతమైనది. ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం,  లేదా భవిష్యత్తులో రానున్న ప్రభుత్వం  ఈ సమస్యలో భాగమేనని మేము భావిస్తున్నాము. వీరందరితో కలిపి చర్చలు జరిపాల్సి ఉంది.

ఫాకిస్తాన్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ మాత్రం యుఎన్ జీఏ, తమ ప్రభుత్వం మాత్రమే తాలిబాన్ ను చర్చలకోసం తీసుకువస్తుందని అంటున్నారు. తాలిబాన్ పై పాకిస్తాన్ ప్రభావం ఎంతవరకు ఉంది ?

మేము ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టాం. గత  ఏడాదిగా మేము అమెరికా బృందంతో తొమ్మిది విడతలుగా చర్చలు సాగించాము. చర్చల ప్రక్రియ ట్రంప్ ఆపేయకుంటే మేము శాంతి  ఒప్పందం పూర్తి చేసుకునే వాళ్లం.  ఇప్పటికే కాల్పుల  విరమణ కూడా జరిగేది. అమెరికన్లు మా దేశం నుంచి ప్రశాంతంగా వీడ్కోలు తీసుకునేవారు. మా దేశ ప్రయోజనాలకు మేము అధిక ప్రాధాన్యమిస్తున్నాము. అమెరికాతో చర్చలకోసం కృషి చేస్తున్న రీతిలోనే ఇతర దేశాలతో మేము సంబంధాలను మెరుగు పర్చుకోవాలనుకుంటున్నాము.

ఇటీవల మీరు మీ అధికారులను విడిపించుకోవడానికి.. భారత ఖైదీలను విడుదల చేశారు. ఇది  ఏ విధంగా జరిగింది. దీనికై చర్చలు సాగాయా ?

అవును.  మా ప్రతినిధులు కొన్ని సార్లు  ఈ విషయమై చర్చలు సాగించారు.

అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి ఉపసంహరణ జరిగిన తర్వాత.. మీ దృష్టి భారత్ వైపు మళ్లిస్తారని అనుమానాలున్నాయి. మీ ఫైటర్లను భారత్ వైపు తిప్పుతారని భయం నెలకొంది.  దీనిపై మీరేమంటారు ?

ఇది శుద్ధ అబద్దం. నిజం కాదు. మా దేశ పునర్ నిర్మాణంలో తోడ్పడుతున్న భారత్ లోకి మేము  ఎందుకు మా ఫైటర్లను పంపుతాం. మాకు సహాయంచేసే దేశాలతో సత్సంబంధాలను కలిగి వుండాలని కోరుకుంటున్నాము. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధానం కాదు మాది.

  • Loading...

More Telugu News