Rythu Bharosa: రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం పెంపు

  • రైతు భరోసా సాయాన్ని రూ.13,500కి పెంచుతూ సర్కారు నిర్ణయం
  • మూడు విడతల్లో చెల్లింపుకు రంగం సిద్ధం
  • రైతు భరోసా కోసం నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

ఏపీలో రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకమీదట రైతులకు రూ.13,500 పెట్టుబడి రూపేణా అందించనున్నారు. రైతు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన పేరుతో అమలు చేయనున్నారు. అయితే రైతులకు అందించే ఈ పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో చెల్లిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు.

విడతల వారీగా రైతు భరోసా ఇవ్వాలని రైతు ప్రతినిధులు కోరారని ఆయన వెల్లడించారు. రైతు భరోసా పథకాన్ని నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లపాటు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లక్షలమంది రైతులకు నేరుగా పెట్టుబడి అందుతుందని అన్నారు. రైతులకు మే నెలలో రూ.7,500 అందిస్తామని, ఖరీఫ్ పంటల కోత సమయంలో, రబీ అవసరాల నిమిత్తం మరో రూ.4000 ఇస్తామని చెప్పారు. సంక్రాంతి వేళ చివరి విడతగా రూ.2000 అందిస్తామని మంత్రి కన్నబాబు వివరించారు.

ప్రస్తుతం 40 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నామని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును మరింత పెంచుతున్నామని చెప్పారు. నవంబరు 15 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Rythu Bharosa
Andhra Pradesh
Jagan
YSRCP
Kannababu
  • Loading...

More Telugu News