Karnataka: ఫలించిన అటవీ అధికారుల ప్రయత్నం.. ఎట్టకేలకు చిక్కిన హంతక పులి!
- రెండు నెలలుగా చామరాజనగర్ జిల్లా ప్రజలను వణికించిన పులి
- ఇద్దరు రైతులు, పదుల సంఖ్యలో జంతువులను చంపితిన్న వైనం
- మత్తుమందు ప్రయోగించి పట్టుకున్న అధికారులు
మనిషి రక్తం రుచి మరిగి ప్రజలను వణికించిన పులి ఎట్టకేలకు చిక్కింది. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ప్రజలకు రెండు నెలలుగా కంటిమీద కునుకును దూరం చేసిన పులిని ఆదివారం అటవీ అధికారులు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. ఇద్దరు రైతులు, ఏనుగు పిల్లతోపాటు పదుల సంఖ్యలో గొర్రెలు, మేకలను చంపితిన్న పులిని బంధించడం కోసం రంగంలోకి దిగిన అటవీ అధికారులు ఆదివారం తమ ప్రయత్నంలో సఫలమయ్యారు.
దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత రోజు అభిమన్యు అనే ఏనుగుతో అడవిలో గాలింపు చేపట్టారు. ఆదివారం మగువనహళ్లిలో సిద్దికి అనే వ్యక్తి పొలంలో అధికారులకు పులి తారసపడింది. వెంటనే మత్తుమందు ప్రయోగించి దానిని స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత వల విసిరి పట్టుకున్నారు. పులి చిక్కిందన్న సమాచారంతో చామరాజనగర్ జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.