Telangana: కేసీఆర్ అంత అమానుషంగా నాడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యవహరించలేదు: బీజేపీ నేత లక్ష్మణ్
- ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ జీతాలు ఇవ్వనంటారా?
- ఇంతకన్నా కక్షసాధింపు చర్యలేమైనా ఉంటాయా?
- గొప్పగా బతకడమంటే పండగ పూట పస్తులుండటమా?
కేసీఆర్ అంత అమానుషంగా నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యవహరించలేదని టీ-బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెను గుర్తించమని, వారితో చర్చలు జరపమని, బస్సులు నడపకపోతే కేసులు పెడతామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారే తప్ప, ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే సాహసం ఆయన చేయలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వనని కేసీఆర్ ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. ఇంతకన్నా కక్షసాధింపు చర్యలు ఇంకేమైనా ఉంటాయా? చివరకు, వైద్యసౌకర్యం కూడా నిలిపివేశారు అని ధ్వజమెత్తారు. ‘స్వరాష్ట్రంలో స్వపరిపాలన’, ‘మన బతుకులు మనం అద్భుతంగా బతుకుదాం’, ‘ఆత్మగౌరవంతో బతుకుదాం’ అని కేసీఆర్ నాడు ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
ఆర్టీసీ కార్మికులు తెలంగాణ బిడ్డలు కాదా? గొప్పగా బతకడమంటే పండగ పూట కార్మిక కుటుంబాలు పస్తులుండటమా? మహిళా కండక్టర్ల పవిటిలను పోలీసులు లాగడమే ఆత్మగౌరవంతో బతకడమా? ఆర్టీసీ కార్మికులు నెలకు రూ.50 వేల చొప్పున జీతం తీసుకుంటున్నారని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు చెప్పాడమేనా స్వపరిపాలన అంటే? వేల కోట్ల ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనుకోవడమేనా స్వపరిపాలన అంటే?ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని బతికించడానికి ఒక్క ప్రయత్నం చేయలేదని విమర్శలు చేసిన కేసీఆర్, ఈరోజున ఆయన చేస్తోందేమిటి? ఆరు నెలల్లో ఆర్టీసీలో ఒక కొత్త పోస్ట్ అయినా భర్తీ చేశారా? ఆర్టీసీ బలోపేతానికి ఒక్క చర్య అయినా చేపట్టారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.