Rythu Bharosa: రైతుల్లో కుల ప్రస్తావనతో వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తోంది: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర
- ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు
- జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు
- ఇది ‘రైతు భరోసా’ కాదు ‘రైతు భారం’
‘రైతు భరోసా’ పథకంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని, సీఎం జగన్ వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీల విషయంలో జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారని అన్నారు. ఈ ప్రభుత్వంలో కులాల ప్రస్తావన ఎంత వరకు వచ్చిందంటే, రైతుల్లో కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చిందని విమర్శించారు. రైతులను కూడా కులాల పేరిట విభజించిన ఘన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది, నాయకుడు జగన్మోహన్ రెడ్డి ది అని ఆరోపించారు.
రైతు భరోసా నిబంధనలు విస్తుగొలుపుతున్నాయని, పొంతన లేకుండా ఉన్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతుకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పిన వైసీపీ, ఇప్పుడు కేంద్రం సొమ్ముతో కలిసి ఆ మొత్తాన్ని ఇస్తామంటున్నారని, ఇది రైతులను మోసగించడం కాదా? దాదాపు 64 లక్షల మంది రైతులకు రూ.8750 కోట్ల వ్యయంతో ఈ పథకం కింద ఖర్చు పెడతామనలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడేమో నలభై లక్షల మందికే ‘రైతు భరోసా’ కల్పిస్తామని కొత్త లెక్కలు చెబుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది ‘రైతు భరోసా’ కాదు ‘రైతు భారం’ అని ధ్వజమెత్తారు. ‘రైతు భరోసా’ విధివిధానాలు చూస్తే వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తోందని అన్నారు.