: బినామీని కాదు.. సినిమాల్లో డబ్బంతా నాదే: బండ్ల గణేశ్
"మొన్నటి వరకూ చిన్న నటుడిగా ఉన్న బండ్ల గణేశ్ నేడింత పెద్ద నిర్మాత ఎలా అయ్యాడు? వందేసి కోట్ల రూపాయలతో సినిమాలను ఎలా తీస్తున్నాడు? ఆయన ఎన్ని సినిమాలు తీశాడు? అందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గణేశ్ ఎవరి బినామీ? బొత్స బినామీనా? మరెవరికైనా బినామీనా? 'నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. హత్య చేసి వచ్చినా కాపాడడానికి నాకు బొత్స ఉన్నాడు' అని గణేశ్ బహిరంగంగానే చెప్పాడు. దీనిలో మర్మం ఏంటి? గణేశ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి? అతడు ఎవరికి బినామీయో తేల్చాలి?" ఇవి తెలుగు దేశం పార్టీ నేత దాడి వీరభద్రరావు సంధించిన ప్రశ్నలు.
తనపై టీడీపీ నేత ఆరోపణలకు గణేశ్ ఈ రోజు స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం తనను బలిచేయవద్దని హైదరాబాద్ లో మీడియా ముఖంగా కోరారు. సినిమాల కోసం వెచ్చిస్తున్న డబ్బంతా తనదేనని చెప్పారు. తాను ఎవరి బినామీ కాదని స్పష్టం చేశారు. టీడీపీ ఆరోపణలు పొలిటికల్ గేమ్ లో భాగమన్నారు. వీటిని ఖండించారు.