Crime News: మంచినీళ్లడిగాడు...మాయ చేసి బంగారం దోచేశాడు!

  • అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వృద్ధురాలి దోపిడీ
  • మత్తు మందు చల్లి నగలు అపహరణ
  • ఒంటరిగా ఉండడాన్ని గుర్తించి స్కెచ్‌

ఓ వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోందని గుర్తించిన కేటుగాడు పక్కా ప్లాన్‌తో ఆమెను దోచేశాడు. మంచినీళ్లడిగి ఇచ్చేలోగా మత్తు మందు చల్లాడు. ఆమె మైకంలోకి వెళ్లగానే బంగారు నగలతో వుడాయించాడు. పోలీసుల కథనం మేరకు...అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామంలో వెంకటరంగమ్మ ఒంటరిగా ఉంటోంది. కొడుకులు అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి ‘మాత్ర వేసుకోవాలి...మంచినీళ్లివ్వండి అవ్వా’ అని అడిగాడు. ఆమె నీళ్లు తెచ్చేందుకు లోపలికి వెళ్తుండగా ఆమెతోపాటు వెళ్లి మత్తు మందు చల్లాడు.

అనంతరం అరవకుండా నోటిని గుడ్డతో కట్టేశాడు. ఆ తర్వాత ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, చేతికి ఉన్న ఐదు తులాల బంగారం గాజులను లాక్కున్నాడు. కమ్మలు కూడా తీసేందుకు ప్రయత్నించగా వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఆమె గొంతునొక్కాడు. దీంతో స్పృహ తప్పి పడిపోయింది.

ఇది గమనించి నగలు తీసుకుని దొంగ వుడాయించాడు. కాసేపటికి స్థానికులు వృద్ధురాలిని గమనించి ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. చుక్కూరులోనూ అదే తరహా దోపిడీ జరగడంతో రెండు ఘటనలకు ఒక్కడే కారణమై ఉంటాడని భావిస్తున్నారు.

Crime News
Anantapur District
tadipatri
old women
robery
  • Loading...

More Telugu News