NRI family: బంధువులను వెతుక్కుంటూ మారిషస్ నుంచి భారత్కు
- ఓ ప్రవాస భారతీయ జంట ప్రయత్నం
- శతాబ్దన్నర తర్వాత ఓ కుటుంబం అన్వేషణ
- బీహార్ రాష్ట్రం పట్నాకు చెందిన వారు
బ్రిటీష్ కాలంలో భారత దేశం నుంచి ఇతర దేశాలకు స్వచ్ఛందంగా వెళ్లిన వారు, బలవంతంగా తీసుకువెళ్లిన నైపుణ్య కార్మికులు ఎందరో ఉన్నారు. అలావెళ్లి పనులు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. ఒకటి రెండు తరాలు గడిచిన తర్వాత శతాబ్దాల అనంతరం వారి వారసులు తమ వారిని వెతుక్కుంటూ భారత్కు రావడం పరిపాటి. ప్రస్తుతం మారిషస్ నుంచి బీహార్ రాష్ట్రంలో అడుగుపెట్టిన జంట అటువంటిదే.
శతాబ్దన్నర తర్వాత తమ బంధువులను వెతుక్కుంటూ వారు ఇక్కడికి వచ్చారు. వివరాల్లోకి వెళితే పట్నా నగరంలోని పుల్వారీషరీఫ్, దానపూర్ ప్రాంతానికి చెందిన బద్రీ అనే వ్యక్తి 1853లో మారిషస్ వెళ్లిపోయారు. ఓడలో కూలీగా పని చేసిన బద్రీ అక్కడే స్థిరపడిపోయారు.
ప్రస్తుతం మారిషస్లో ఉంటున్న ఆయన మునిమనుమడు హేమానంద్ బద్రీకి తన ముత్తాత బంధువుల గురించి తెలుసుకోవాలని, వారిని కలవాలన్న ఆసక్తి కలిగింది. అంతే భార్య విద్యావతితో కలిసి భారత్కు విచ్చేశాడు. ప్రస్తుతం పట్నాలోని పుల్వారీషరీఫ్ ప్రాంతంలో తమ వారి కోసం వెతుకుతున్నాడు. తమ వద్ద ఉన్న చిన్నపాటి ఆధారాలను అక్కడికి వారికి చూపిస్తూ జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఈ జంట.