Vodaphone - Idea: జియోకు షాకిచ్చిన వోడాఫోన్-ఐడియా... పైసా కూడా వద్దని ప్రకటన!
- ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు
- జియో ప్రకటనపై మండిపడుతున్న వినియోగదారులు
- తాము మాత్రం ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమన్న వోడాఫోన్ - ఐడియా
తమ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో, ఆ సంస్థకు షాకిస్తూ, తాము మాత్రం ఎటువంటి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లను వసూలు చేయబోమని స్పష్టం చేసింది.
కాల్స్ మొత్తం ఉచితమేనంటూ, కేవలం డేటాకు డబ్బు చెల్లిస్తే సరిపోతుందంటూ, రెండు సంవత్సరాల క్రితం మార్కెట్లోకి వచ్చిన జియో, భారత టెలికం రంగంలో సంచలనమైన సంగతి తెలిసిందే. జియో ఇప్పుడు ఇండియాలో టాప్-2లో ఉంది. తాజాగా ఐయూసీ చార్జీల వసూలు ప్రకటనతో సోషల్ మీడియాలో జియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, వినియోగదారుల పరంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న వోడాఫోన్-ఐడియా మాత్రం తమకు ఎటువంటి ఐయూసీ చార్జీలను వసూలు చేసే ఉద్దేశం లేదని తెలిపింది. తమ వినియోగదారులు ఇతర నెట్ వర్క్ కాల్స్ కోసం ఎప్పటిలానే కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం పడకూడదనేదే తమ అభిమతమని తెలిపింది. ఇదే సమయంలో ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడం తొందరపాటు చర్యని, ఇంటర్ కనెక్ట్ మధ్య నలుగుతున్న సమస్యకు ఇది పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది.
ఇదిలావుండగా, ఐయూసీ చార్జీల వ్యవహారం మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాలే తప్ప వినియోగదారులకు సంబంధించిన విషయం కాదని గతంలోనే ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించిన సంగతి తెలిసిందే.