Crime News: కూలీల అవతారం... చోరీలే అసలు వ్యాపకం!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8a822ea972ef58953a2429b753353433ce9c4604.jpg)
- ఆలయాల్లో దొంగతనాలే ప్రధాన టార్గెట్
- అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
- నిందితులు తూర్పుగోదావరి జిల్లా వాసులు
పగలంతా నిర్మాణ రంగంలో కూలీలుగా వ్యవహరిస్తూ రాత్రయితే వీలున్నచోట ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ముఠా ఆరు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు...తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తుమ్మలనగర్‌కు చెందిన పేరా నర్సింహ (23), మాదకం రమేష్ (22), రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుండి జగదీష్ (21), పినపాక గ్రామానికి చెందిన పెడియా సారయ్య (19)లు ఓ ముఠాగా ఏర్పడి చోరీకు పాల్పడుతున్నారు.
గతంలో ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లారు. రెండు నెలల క్రితం జైలు నుంచి బయటకు వచ్చాక ఎల్‌బీనగర్ సమీపంలోని భరత్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని దిగారు. కొన్ని రోజులపాటు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూనే ఆలయాలపై దృష్టిసారించారు. ఎన్టీఆర్ నగర్, మున్సూరాబాద్, సాయినగర్ పరిధిలోని ఆరు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.
ఉప్పల్‌లో ఓ బైకు దొంగిలించారు. చోరీ చేసిన బండిపై తిరుగుతున్న వీరిని అనుమానించిన మఫ్టీలో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు వ్యవహారం బయటపడింది. నిందితుల నుంచి రూ.6వేలు, ఓ బైకు, నకిలీ బంగారు పుస్తెలు, హారం స్వాధీనం చేసుకున్నారు.