manyamkonda: మహబూబ్ నగర్ మీదుగా వెళ్లే పలు రైళ్లు పాక్షిక రద్దు!
- మన్యంకొండ ట్రాక్ పై ఒరిగిపడ్డ కాంక్రీట్ క్లీనింగ్ యంత్రం
- ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లకు ఆటంకం
- పలు రైళ్ల దారి మళ్లింపు
మహబూబ్ నగర్ మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ రైల్వే ట్రాక్ పైకి కాంక్రీట్ క్లీనింగ్ భారీ యంత్రం ఒరిగింది. దీంతో, ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లకు ఆటంకం ఏర్పడింది.
దీంతో కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్, సికింద్రాబాద్-కర్నూలు సిటీ ఎక్స్ ప్రెస్ ను మహబూబ్ నగర్ వరకే పరిమితం చేశారు. కాచిగూడ-కర్నూలు సిటీ రైలును ఉందానగర్ వరకు, తుంగభద్ర ఎక్స్ ప్రెస్ (కర్నూలు సిటీ- సికింద్రాబాద్) రైలును దేవరకొండ వరకు, రాయచూర్- కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును గద్వాల వరకు, గుంటూరు-కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును కౌకుంట్ల వరకు పరిమితం చేశారు.
ఇక కాచిగూడ-చెంగల్ పట్టు, కాచిగూడ-నాగర్ కోయిల్, కాచిగూడ-చిత్తూరు, కాచిగూడ-మైసూరు రైళ్లను, ఓఖా-రామేశ్వరం ఎక్స్ ప్రెస్ ట్రైయిన్ ని రాయచూర్, గుత్తి మీదుగా మళ్లించారు. రైల్వే ట్రాక్ పై ఒరిగిపడ్డ క్లీనింగ్ యంత్రాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక రైలును అక్కడికి పంపనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.