Hyderabad: అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలుపునిద్దాం: జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి
- కేసీఆర్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు
- ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకమూ జరగలేదు
- ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ డబ్బు ఎందుకు ఇవ్వరు?
హైదరాబాద్ లో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ సమ్మె ముఖ్య ఉద్దేశం జీతాల కోసం కాదు అని, ఆర్టీసీని నష్టాల నుంచి బతికించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో కనీసం ఒక్క నియామకం కూడా జరగలేదని విమర్శించారు. ఆర్టీసీపై డీజిల్ భారం పెరిగిందంటున్నా పట్టించుకోవడం లేదని, 27 శాతం పన్ను వేస్తున్నారని అన్నారు. ప్రజా రవాణాపై నాల్గో వంతు ప్రజలు ఆధారపడి ఉన్నారని, అన్ని రాజకీయ పార్టీలు తమ సమ్మెకు సహకరించాలని కోరారు. తార్నాక ఆస్పత్రిలోని ఆర్టీసీ కార్మికులకు చికిత్సలు నిలిపివేశారని, ఆర్టీసీ కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలుపు నిద్దామని అన్నారు.