Facebook: ఒక్క అవకాశం ఇప్పిస్తానంటూ లక్ష కాజేశారు!

  • ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి
  • సీరియల్ లో అవకాశమంటే నమ్మిన మహిళ
  • దఫదఫాలుగా డబ్బు వసూలు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి, టీవీ సీరియల్ లో అవకాశం ఇప్పిస్తానని చెబితే, నమ్మి అడ్డంగా మోసపోయింది హైదరాబాద్ కు చెందిన మోడల్. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రామ్ కోటి ప్రాంతానికి చెందిన మహిళ (40) నటిగా, మోడల్ గా పని చేస్తోంది. ఆమెకు ముంబైకి చెందిన అంజు కుమార్ ఓజా అలియాస్ చక్రవర్తి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను సినిమాలు తీస్తుంటానని, మోడలింగ్ కోసం ప్రొడక్షన్ సంస్థ ఉందని, వ్యాపారాలు కూడా చేస్తుంటానని చెబితే, ఆమె నమ్మింది. ఆపై తన అసిస్టెంట్ రాకేశ్ మిమ్మల్ని సంప్రదిస్తాడని చెప్పాడు.

రెండు రోజుల తరువాత రాకేశ్ ఆమెకు ఫోన్ చేసి, మోడలింగ్ కోసం రూ. 3 వేలు, ఆర్టిస్ట్ కార్డ్ కోసం రూ. 10 వేలు, ముంబైకి విమానం టిక్కెట్లంటూ రూ. 7 వేలు వసూలు చేశారు. ఆపై మోడల్ గా కన్నా నటిగా అయితే బాగుంటుందని చెబుతూ 'నిమ్కి ముఖియ' సీరియల్ లో పాత్ర పేరు చెప్పి రూ. 24 వేలు, తనకు కమీషన్ అంటూ మరో రూ. 15 వేలు... ఇలా దఫదఫాలుగా లక్ష రూపాయల వరకూ నొక్కేశారు. ఆపై వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో, తాను మోసపోయానని గుర్తించిన ఆ మహిళ, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News