Rohit Sharma: నా నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ విధంగానే ఆడతా: రోహిత్ శర్మ

  • వైజాగ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు
  • రోహిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
  • టెస్టుల్లోనూ ఓపెనర్ గా అవకాశం దక్కించుకున్న రోహిత్

వైజాగ్ టెస్టులో ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీల మోత మోగించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎగరేసుకెళ్లాడు. దక్షిణాఫ్రికాపై భారత్ విజయంలో తనవంతు పాత్రను సమర్థంగా పోషించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, తన నుంచి ఎలాంటి ఆటను ఆశిస్తున్నారో ఆ విధంగా ఆడడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నానని రోహిత్ శర్మ తెలిపాడు. రెండేళ్ల క్రితమే టీమిండియా టెస్టు జట్టులో ఓపెనింగ్ స్థానంలో తాను ఆడే విషయం చర్చకు వచ్చిందని, అప్పటి నుంచి నెట్స్ లో కూడా కొత్త బంతితోనే ప్రాక్టీస్ చేసేవాడ్నని వెల్లడించాడు. అందుకే ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ లో ఓపెనర్ అవకాశం లభించడం పట్ల పెద్దగా ఆశ్చర్యం కలగలేదని అన్నాడు.

టాపార్డర్ లో ఇలాంటి చాన్స్ రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు. ఆరంభంలో మూలాలకు కట్టుబడి ఆడితే ఆ తర్వాత పరుగులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడడం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డాడు. జాగ్రత్తతో కూడిన దూకుడే తన మంత్రం అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. భారత జట్టుకు టీ20లు, వన్డేల్లో తిరుగులేని ఓపెనర్ గా ఉన్న రోహిత్ శర్మకు టెస్టుల్లో ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేదు. టెస్టుల్లో ఇంతకుముందు మిడిలార్డర్ లో వచ్చిన రోహిత్ కు ఈసారి ఓపెనర్ గా ప్రమోషన్ ఇచ్చారు. వచ్చీ రావడంతోనే భారీ సెంచరీలతో జూలు విదిల్చాడీ ముంబై వాలా.

  • Loading...

More Telugu News