Pushpasrivani: పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ ఫిర్యాదు... టీడీపీ కుట్రగా పేర్కొన్న ఏపీ మంత్రి

  • కుల వివాదంలో పుష్పశ్రీవాణి
  • ఆమె ఎస్టీ కాదంటూ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
  • గతంలోనూ ఇవే ఆరోపణలు వచ్చాయన్న పుష్పశ్రీవాణి
  • న్యాయమే గెలుస్తుందంటూ ధీమా

ఏపీ మంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం లీగల్ అడ్వైజర్ రేగు మహేశ్, ఆలిండియా దళిత హక్కుల సంఘం ఏపీ చీఫ్ మణి సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. పుష్పశ్రీవాణి కొండదేవర తెగకు చెందిన వ్యక్తి కాదని, ఆమె గిరిజన మహిళ కాదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో సైతం పుష్పశ్రీవాణి అసత్యాలు పొందుపరిచారని తెలిపారు.

అయితే, దీనిపై స్పందించిన మంత్రి పుష్పశ్రీవాణి దీనిని టీడీపీ కుట్రగా అభివర్ణించారు. గత 11 ఏళ్లుగా ఈ వివాదం నడుస్తోందని, గతంలో పలు పర్యాయాలు ఇలాగే ఆరోపణలు చేశారని, న్యాయం తన పక్షానే నిలిచిందని చెప్పారు. ఆ ఆరోపణలు కోర్టులో నిలబడలేదని, ఈసారి కూడా సత్యమే గెలుస్తుందని అన్నారు. కాగా, రేగు మహేశ్, మణి సింగ్ ల ఫిర్యాదుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News