Paruchuri Gopalakrishna: 'సైరా' చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా తీస్తారా? అని చిరంజీవి అడిగారు: పరుచూరి గోపాలకృష్ణ
- హైదరాబాద్ లో సైరా 'థాంక్యూ మీట్'
- హాజరైన పరుచూరి బ్రదర్స్
- ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరుచూరి గోపాలకృష్ణ
రేనాటి సూర్యుడిగా పేరుగాంచిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'సైరా' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో 'థాంక్యూ మీట్' నిర్వహించింది. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు రచయితలు పరుచూరి బ్రదర్స్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'సైరా' కథను 2004లోనే తన సోదరుడు పరుచూరి వెంకటేశ్వరావు రాశారని, కానీ బడ్జెట్ కారణంగా ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చిందని తెలిపారు. మధ్యలో చిరంజీవి రాజకీయాలతో బిజీగా ఉన్న సమయంలో తన కుమారుడు రామ్ చరణ్ ను హీరోగా పెట్టి 'సైరా' తీయగలరా? అని అడిగారని గుర్తుచేసుకున్నారు. అయితే, తాము "ఎవరూ వద్దు, 'సైరా'కు మీరే కావాలి" అని పట్టుబట్టామని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. సినిమా టాక్ విన్న తర్వాత చిరంజీవి "ధన్యవాదాలు సోదరా" అంటూ మెసేజ్ పెట్టారని, ఇదంతా ఆ కథ గొప్పదనమేనని ఆయన వివరించారు.