Narendra Modi: ఒకరి తర్వాత ఒకరు ప్రధాని మోదీతో సమావేశం కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
- ఈ సాయంత్రం ఢిల్లీ పయనం కానున్న కేసీఆర్
- రేపు ప్రధానితో భేటీ
- ఈ నెల 5న మోదీని కలవనున్న ఏపీ సీఎం జగన్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో విడివిడిగా భేటీ కానున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ పయనం కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. యురేనియం సర్వే నిర్ణయం ఉపసంహరణ, పాలమూరు ప్రాజెక్టుకు నిధులు, మెట్రో రైల్ వ్యవస్థ విస్తరణ కోసం నిధులు వంటి అంశాలను సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నారు. కేసీఆర్ ప్రధానిని కలవడం దాదాపు 9 నెలల తర్వాత ఇదే ప్రథమం.
ఇక ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. జగన్ ఎప్పుడు కోరితే అప్పుడు పీఎం అపాయింట్ మెంట్ దొరుకుతున్నా, ప్రత్యేకహోదా అంశంపై మాత్రం కేంద్రం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో, పోలవరం ప్రాజెక్టు అంశం, విభజన హామీలు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాలను జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారు. తన భేటీ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ పీఎంకు మరోసారి గుర్తుచేసే అవకాశాలున్నాయి.