Narendra Modi: మహాత్ముడికి ఇష్టమైన 'వైష్ణవ జన తో' గీతాన్ని 150కి పైగా దేశాల గాయకులు ఆలపించారు: మోదీ
- అహ్మదాబాద్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోదీ
- జాతిపితకు నివాళులు
- ప్రపంచనేతల గౌరవం పొందారంటూ గాంధీకి కితాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సబర్మతి ఆశ్రమంలో జాతిపితకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ప్రపంచనేతల గౌరవం పొందారని తెలిపారు. మహాత్మాగాంధీకి 'వైష్ణవ జన తో' చాలా ఇష్టమైన భజనగీతం అని, ఈ గీతాన్ని 150కి పైగా దేశాల గాయకులు వివిధ భాషల్లో ఆలపించడం మహాత్ముడి స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పారు.
భారత్ ఇప్పుడు ప్రపంచశక్తిగా అవతరిస్తోందని, ప్రపంచదేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే ప్రపంచదేశాల్లో భారత్ ప్రతిష్ఠ ఎంతో పెరిగిందని మోదీ చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినం ప్రతిపాదన చేస్తే స్వల్ప వ్యవధిలో ఆమోదం లభించిందని వివరించారు.