East Godavari District: కష్టమే...కానీ నా అనుభవాన్ని జోడించి బోటు బయటకు తీస్తా : ధర్మాడి సత్యం

  • డైవర్స్‌ను లోపలికి పంపి వెలికి తీయడం సాధ్యం కాదు
  • పైనుంచి యాంకర్లు వేసి తీయడమే సులువు
  • పనిపూర్తయ్యేందుకు మూడు రోజులు పట్టొచ్చు

గోదావరి నదిలో మునిగిపోయిన బోటును కచ్చితంగా బయటకు తీస్తానని ప్రభుత్వం ఆ బాధ్యత అప్పగించిన కాకినాడ బాలాజీ మెరైన్స్‌ సంస్థ యజమాని ధర్మాడి సత్యం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద 15 రోజుల క్రితం బోటు మునిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన మరో 16 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. దీంతో బోటు వెలికితీస్తే మృతదేహాలు దొరక వచ్చన్న కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఈ సంస్థకు బోటును వెలికితీసే బాధ్యతను అప్పగించింది.

ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆయన ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ తనకీ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉందన్నారు. బలిమెల, చిత్రకొండలో నక్సల్స్‌ దాడిలో మునిగిపోయిన బోటును పైకి తీశామని గుర్తు చేశారు. అలాగే యానాం, నాగార్జునసాగర్‌లో మునిగి బోటులను వెలికితీసినట్లు తెలిపారు.

‘గోదావరి నదిలో బోటు వెలికి తీయడం సాహసమే. పైగా వరద ప్రవాహం ఉధృతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇది ఒక సవాల్‌. కానీ నా అనుభవాన్ని జోడించి బోటును విజయవంతంగా వెలికి తీయగలనన్న నమ్మకం నాకుంది’ అని తెలిపారు. ప్రస్తుతం బోటు మునిగిన ప్రాంతం, లోతు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే  డైవర్స్‌ కిందకు వెళ్లి బోటును బయటకు తీయడం సాధ్యం కాదన్నారు.

బోటు 215 అడుగుల లోతున ఉందని గుర్తించామని, అందువల్ల యాంకర్లు ఉపయోగించి పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బోటు ఒకవేళ బురదలో చిక్కుకున్నా యాంకర్లు బయటకు తీసుకురాగలవన్నారు. బోటు వెలికి తీసే కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తానని చెప్పిందని, పని ప్రారంభించాక మూడు రోజుల్లో బోటు వెలికితీత పూర్తవుతుందని చెప్పారు.

తమ వారి మృతదేహాలు బోటులో చిక్కుకుంటే దీని వల్ల కనీసం చివరిచూపు అయినా దక్కుతుందని ఆశించిన వారికి ఈ వార్త కాస్త ఊరట నిచ్చే అంశం.

East Godavari District
kachuluru
boat accident
lift the boat
balaji merains
  • Loading...

More Telugu News