Iron Box: ఐడియా అదిరింది...గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టె వచ్చేసింది
- బొగ్గు కొరతతో సతమతమవుతున్న దోబీలు
- దీంతో గ్యాస్ ఐరన్ బాక్స్‌ను ప్రవేశపెట్టిన కంపెనీలు
- ఉపయుక్తంగా ఉందంటున్న వినియోగదారులు
అవసరం మనిషిని కొత్త దారులు వెతుక్కునేలా చేస్తుంది. ఒకప్పుడు పట్టణం, పల్లె అన్న తేడాలేకుండా కట్టెల పొయ్యిపైనే ఎక్కువ మంది వంట చేసుకునేవారు. దీంతో బొగ్గుకు కొరత ఉండేది కాదు. ఇప్పుడు పూరిగుడిసెలోనూ గ్యాస్ పొయ్యి కనిపిస్తోంది. అటువంటప్పుడు బొగ్గులు ఎక్కడ నుంచి వస్తాయి. బొగ్గు దొరకక పోవడం, దొరికినా చాలా ఎక్కువ ధర పలుకుతుండడంతో బొగ్గుతో పనిచేసే ఇస్త్రీపెట్టెలకు ఇంధనం లేక దోబీలు కొన్నాళ్లుగా సతమతమవుతున్నారు.
ఈ పరిస్థితిని చూసి ఓ కంపెనీ గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టెను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇంకేం...ఇదేదో బాగుందని ముచ్చటపడి కొనుక్కుంటున్నారు దోబీలు. ధర దాదాపు 8 వేల రూపాయలున్నా నిత్యం బొగ్గుల కోసం వెతికే కన్నా ఇదే మంచిదంటున్నారు. గ్యాస్ అందుబాటులోనే ఉంటుంది కావున ఇబ్బంది లేదని, ఒక గ్యాస్ సిలెండర్‌తో దాదాపు 500 దుస్తులు ఇస్త్రీ చేయొచ్చని దోబీలు చెబుతున్నారు.