cm: నాలుగు నెలల్లో నరకాన్ని చూపిస్తున్నారు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
- తప్పుడు ఆరోపణలు, తప్పుడు పనులు చేయొద్దు
- మీ పార్టీ పర్మినెంట్ కాదు.
- రాష్ట్రం పర్మినెంట్..సమాజం శాశ్వతం
గ్రామ వాలంటీర్లతో పెద్ద ప్రమాదం వచ్చి పడిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనలో ఓ మహిళ పట్ల గ్రామవాలంటీర్ ప్రవర్తన కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. అసలు, వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా కావాలని ఎవరు అడిగారు? ఐదు వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది? గోనె సంచులు మోసే ఉద్యోగమా! అని అన్నారు. ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చేశామని మాట్లాడతారా? అని వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
గ్రామ వాలంటీర్లు ఎప్పుడు పడితే అప్పుడు ప్రజల ఇళ్లకు వెళ్లి వారిని డిస్టర్బ్ చేస్తున్నారని విమర్శించారు. ‘డే టైమ్ మగవాళ్లు ఉండరు. వెళ్లిపోయి తలుపులు కొట్టడం. ఎంత నీచం? ఎంత బాధ, ఆవేదన, ఆవేశం వస్తుంది’ అని అన్నారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకోమని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఉపేక్షించదని స్పష్టం చేశారు. ‘మీరు చేసే పని కరెక్టుగా చేయండి. తప్పుడు ఆరోపణలు, తప్పుడు పనులు చేయొద్దు. మీరు పర్మినెంట్ కాదు.. మీ పార్టీ పర్మినెంట్ కాదు. రాష్ట్రం పర్మినెంట్..సమాజం శాశ్వతం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాలుగు నెలల్లో నరకాన్ని చూపిస్తున్నారు’ అని మండిపడ్డారు.