CBI: సీబీఐలో మరోసారి బయటపడ్డ లుకలుకలు... జేడీపై పీఎంవోకి లేఖ రాసిన డీఎస్పీ
- గతేడాది వర్మ వర్సెస్ ఆస్థానా వ్యవహారంతో రచ్చకెక్కిన సీబీఐ ప్రతిష్ఠ
- తాజాగా జేడీతో డీఎస్పీ పోరు
- అమాయకుల్ని ఎన్ కౌంటర్ చేశారంటూ జేడీపై ఆరోపణలు చేసిన డీఎస్పీ
కొన్నాళ్ల కిందట అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానా వంటి సీనియర్ అధికారులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో సీబీఐ పరువు గంగపాలైంది. మళ్లీ ఇప్పుడు అదే రీతిలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య చిచ్చు రగులుకుంది. సీబీఐ జేడీ ఏకే భట్నాగర్, డీఎస్పీ ఎన్ పీ మిశ్రాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలో డీఎస్పీ ఎన్ పీ మిశ్రా ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖలో జేడీ ఏకే భట్నాగర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
జార్ఖండ్ లో 14 మంది సామాన్యులను ఎన్ కౌంటర్ చేయడం వెనుక భట్నాగర్ హస్తం ఉందని, సీబీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎన్ కౌంటర్ కేసు దర్యాప్తు సజావుగా సాగాలంటే భట్నాగర్ ను విధుల నుంచి తప్పించాలని మిశ్రా తన లేఖలో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబీకులు భట్నాగర్ పదవిలో కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, భట్నాగర్ పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.