YSRCP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోంది: చంద్రబాబునాయుడు
- దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు?
- తప్పుడు రికార్డులతో నిందలు వేస్తున్నారు
- పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలు
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని విమర్శించారు. పీపీఏలపై ప్రధాని మోదీకి సీఎం జగన్ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలేనని విమర్శించారు. టీడీపీ హయాంలో దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు.విద్యుత్ రంగంలో మొదట సంస్కరణలు తీసుకొచ్చింది తామేనని విద్యుత్ కోతల నుంచి మిగులు విద్యుత్ సాధించామని, నాణ్యమైన, తక్కువ ధరకు విద్యుత్ అందించాలని ముందుకెళ్లామని అన్నారు.
టీడీపీ హయాంలో విద్యుత్ రంగానికి 149 అవార్డులు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. దీర్ఘకాలంలో పునరుత్పాదక విద్యుత్తే చవక అని సీఎంకు కేంద్ర మంత్రి రాసిన లేఖలో చెప్పారని, ఇదే విషయమై నిపుణులు, న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం చెప్పినా పట్టించుకోవడం లేదని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
మీడియా సమావేశం ఏర్పాటు చేసి తప్పుడు సమాచారం ఇచ్చే అధికారం అధికారులకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారం ఇవ్వడానికి అధికారులకు ఎంత ధైర్యం? అని ప్రశ్నించారు. చట్టాలను ఉల్లంఘిస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారని, తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్షార్హులే అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రానికి రూ.7500 కోట్ల నష్టం అని, ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదని, ఎవరు చెప్పినా వినకుండా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.