Airtel payments bank: ఎయిర్‌టెల్ నుంచి మస్కిటో డిసీజ్ ప్రొటెక్షన్ ప్లాన్.. ఏడాదికి రూ.99తో అద్భుత బీమా
- దోమకాటుతో వచ్చే ఏడు రకాల వ్యాధులకు బీమా సౌకర్యం
- హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌జీవోతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఒప్పందం
- కూలీలు, వ్యక్తి ఆధారిత కుటుంబాలే లక్ష్యంగా పాలసీ
దోమకాటు బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ప్రత్యేక బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌జీవోతో ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ‘మస్కిటో డిసీస్ ప్రొటెక్షన్ పాలసీ’ పేరుతో సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందులో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జపనీస్ ఎన్సెఫాలటిస్, కాలా అజర్, లింఫటిక్ ఫిలేరియాసిస్, జికా వైరస్ వంటి ఏడురకాల వ్యాధులకు బీమా లభిస్తుంది. ఇందుకోసం ఏడాదికి రూ.99 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వలస, రోజువారీ కూలీలు, వ్యక్తి ఆధారిత కుటుంబాల కోసం ఈ బీమాను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ బీమా ద్వారా ఆసుపత్రి ఖర్చుల నుంచి ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.