Jagan: సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదం... ఏడుగురు అధికారులకు నోటీసులు

  • ఈ నెల 21న నంద్యాల పరిధిలో సీఎం ఏరియల్ సర్వే  
  • అలసత్వం వహించారంటూ సీఎంవో ఆగ్రహం
  • అధికారులపై విచారణ

ఇటీవల వరద ముంపు బారినపడిన నంద్యాల పట్టణం, పరిసర ప్రాంతాల ఏరియల్ సర్వేకు వెళ్లిన సీఎం జగన్ హెలికాప్టర్ కు ల్యాండింగ్ సమస్య ఎదురవగా, సీఎంవో ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది. ఏపీ సీఎం ఈ నెల 21న నంద్యాల పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అయితే ఆయన హెలికాప్టర్ నంద్యాలలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా, ఆ మేరకు విధి నిర్వహణలో అలసత్వం వహించారని పలువురు అధికారులపై సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ వెంటనే స్పందించి డీఆర్వో వెంకటేశంను విచారణ అధికారిగా నియమించి అసలేం జరిగిందో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. దీనిపై విచారణ జరిపిన డీఆర్వో వెంకటేశం ఏడుగురు అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.

సర్వే,ల్యాండ్ రికార్డుల ఏడీ హరికృష్ణ, డ్వామా పీడీ వెంకటసుబయ్య, శిరువెళ్ల, నంద్యాల తహసీల్దార్లు నాగరాజు, రమేశ్, గోస్పాడు ఎంపీడీవో సుగుణశ్రీ, ఉయ్యాలవాడ తహసీల్దార్ నాగేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ వేణు నోటీసులు అందుకున్నారు. జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కోఆర్డినేట్స్ రిపోర్టును డిగ్రీలు, నిమిషాలు, సెకన్ల ఫార్మాట్ లో ఇవ్వాల్సి ఉండగా,  అధికారులు కేవలం డిగ్రీల ఫార్మాట్ లోనే పంపినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News