Kala Venkatrao: గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలను ఐదుగురు ఉపముఖ్యమంత్రులు సమర్థించుకోవడం దారుణం: కళా వెంకట్రావు
- వివాదాస్పదంగా మారిన గ్రామ, వార్డు సచివాలయ నియామకాలు
- అభ్యర్ధులను బెదిరిస్తున్నారంటూ కళా వెంకట్రావు ఆరోపణ
- అవకతవకలపై సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల తీరుపై స్పందించారు. ఓవైపు నియామకాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు గగ్గోలు పెడుతుంటే, ఎలాంటి అక్రమాలు జరగలేదని ఐదుగురు డిప్యూటీ సీఎంలు సమర్థించుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. అవకతవకలపై నోరెత్తవద్దంటూ అభ్యర్థుల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో అక్రమాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫలితాలను నిలుపుదల చేసి, నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ఇతర హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని, నియంతలా పాలించడం సరికాదని, జరుగుతున్న అక్రమాలపై సర్కారు స్పందించాల్సిందేనని స్పష్టం చేశారు.