Team India: టీమిండియా క్రికెటర్ల రోజువారీ భత్యం రెట్టింపు చేసిన బీసీసీఐ
- ఇప్పటివరకు భారత ఆటగాళ్లకు రోజుకు 125 డాలర్ల చెల్లింపు
- ఇప్పుడది 250 డాలర్లకు పెంపు
- ఆటగాళ్ల వసతి, ఇతర ఖర్చులు కూడా బీసీసీఐ ఖాతాలోనే!
ఒక్కసారి భారత జట్టుకు ఎంపికైతే ఆ క్రికెటర్ ఆర్థిక స్థితి చాలావరకు మెరుగుపడుతుందనడంలో సందేహం లేదు! ఆటగాళ్లతో బీసీసీఐ కుదుర్చుకునే కాంట్రాక్టులు కానీ, చెల్లించే ఫీజులు కాని ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా బీసీసీఐ పాలకులు తీసుకున్న నిర్ణయమే అందుకు నిదర్శనం. టీమిండియా ఆటగాళ్లకు ఇస్తున్న రోజువారీ భత్యాన్ని రెట్టింపు చేశారు. ఇప్పటివరకు భారత క్రికెటర్లకు దినసరి ఖర్చుల కింద 125 డాలర్లు ఇచ్చేవారు. ఇప్పుడది 250 డాలర్లకు పెంచుతూ బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) నిర్ణయం తీసుకుంది. 250 డాలర్లంటే భారత కరెన్సీలో రూ.17,800 వరకు ఉంటుంది. అంతేకాకుండా, ఆటగాళ్ల బస, లాండ్రీ, ఇతర ఖర్చులను సైతం పూర్తిగా బీసీసీఐనే భరిస్తుంది.