Andhra Pradesh: ఏపీ ‘గ్రామ సచివాలయం’ పేపర్ లీకేజీ.. ఏపీపీఎస్సీ ఉద్యోగుల కుటుంబాలకే టాప్ ర్యాంకులు: మీడియాలో కథనాలు

  • సంచలన కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక
  • పేపర్ టైప్ చేసిన ఉద్యోగే టాపర్ గా నిలిచారని వెల్లడి
  • రిటైర్డ్ అధికారి చేతికి ముందుగానే ప్రశ్నాపత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు, వాలంటీర్ పరీక్షల ఫలితాలపై వివాదం చెలరేగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నిన్న విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ రోజు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను జిల్లాలవారీగా ప్రకటిస్తుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ పరీక్ష పేపర్లను సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులే టాప్ ర్యాంకర్లుగా భారీ మార్కులు సాధించారని సదరు పత్రిక తన కథనంలో తెలిపింది.

అనంతపురం జిల్లాకు చెందిన జి.అనితమ్మ అనే అమ్మాయి కేటగిరి-1 విభాగంలో టాపర్ గా నిలిచారనీ, అయితే ఆమె ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి(జూనియర్ అసిస్టెంట్)గా పనిచేస్తున్నారని వెల్లడించింది. గ్రామ వార్డు, సచివాలయం పేపర్ ను ఆమె టైప్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నట్లు పేర్కొంది. ఇక కేటగిరి-3లో ఫస్ట్ ర్యాంకర్ దొడ్డా వెంకట్రామిరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఈయన సొంత అన్న వెన్నా మహేశ్వర్ రెడ్డి ఏపీపీఎస్సీలోనే ఏఎస్ వో హోదాలో పనిచేస్తున్నారు.

అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన ఓ రిటైర్డు అధికారి చేతికి ఈ ప్రశ్నాపత్రం ముందుగానే వెళ్లిపోయినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది. ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుటుంబంలో భార్య సహా ముగ్గురికి గ్రామసచివాలయం పరీక్షల్లో 3 ర్యాంకులు వచ్చాయని చెప్పింది. 150 మార్కులకు గానూ నిర్వహించిన ఈ పరీక్ష చాలా కఠినంగా ఉందని పలువురు అభ్యర్థులు చెప్పారనీ, 100 మార్కులు దాటితే గొప్పేనని. కానీ అనూహ్యంగా ఫస్ట్ ర్యాంకర్ కు 112.50 మార్కులు రావడంతో ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందన్న అనుమానాలు బలపడ్డాయని సదరు పత్రిక తన కథనంలో చెప్పింది.

  • Loading...

More Telugu News