Khammam District: చనిపోయే ముందూ కుటుంబ సభ్యులకు ‘పరీక్ష’ పెట్టాడు!
- తొలుత మృతి చెందినట్టు వైద్యుల నిర్ధారణ
- అంబులెన్స్‌లో తెస్తుంటే శ్వాస తీసుకుని కదలడంతో ఆశ్చర్యం
- ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుంటే కాసేపటికి మృతి
కుటుంబ సభ్యుడు మరణించారంటే ఎవరికైనా విషాదమే. దుఃఖం ముంచుకు వస్తుంది. ఇక్కడ కూడా అతను చనిపోయాడని చెప్పగానే కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంటికి తెస్తుంటే విచిత్రంగా కదిలాడు. బతికే ఉన్నాడని ఆనందంతో ఆసుపత్రిలో చేర్పిస్తే కాసేపటికి కన్నుమూశాడు. చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు పరీక్షలా మారిన ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన నల్లమోతు విశ్వనాథం (35) ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చనిపోయాడని వైద్యులు చెప్పడంతో నిన్న అంబులెన్స్‌లో శవాన్ని స్వగ్రామానికి తీసుకువస్తున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ఊర్లోని బంధువులకు సమాచారం అందించారు.
కొణిజర్ల వద్ద అంబులెన్స్ ఆపి కుటుంబ సభ్యులు భోజనానికి దిగారు. భోజనం పూర్తయ్యాక తిరిగి వెళ్లేందుకు అంబులెన్స్ తలుపు తెరవగా విశ్వనాథం కదులుతున్నాడు. శ్వాస తీసుకుంటున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు దగ్గరలోని వైద్యునికి వద్దకు తీసుకువెళ్లగా అతను బతికే ఉన్నాడని చెప్పడంతో ఆశ్చర్యపోయారు.
ఆనందంతో వెంటనే ఖమ్మం తీసుకువచ్చి అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, వారి ఆనందం ఎంతసేపో నిలవలేదు. కొన్ని గంటలపాటు చికిత్స పొందిన విశ్వనాథం నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.