Andhra Pradesh: నడిరోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యే కొడుకు ‘బర్త్ డే’ వేడుకలు.. రెండు గంటల పాటు అంబాజీపేటలో ట్రాఫిక్ జామ్ !
- తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేటలో ఘటన
- ఎమ్మెల్యే చిట్టిబాబు తనయుడు వికాస్ నిర్వాకం
- దుమ్మెత్తిపోసిన అంబాజీపేట ప్రజలు, స్కూలు పిల్లలు
తండ్రి ఎమ్మెల్యే.. సొంత పార్టీ అధికారంలో ఉంది... ఇంకేముంది? సదరు ఎమ్మెల్యే సుపుత్రుడు రెచ్చిపోయాడు. పుట్టినరోజు వేడుకలను ఇంట్లో చేస్తే ఏం మజా ఉంటుందిలే అనుకున్నాడేమో.. ఏకంగా నాలుగు రోడ్ల జంక్షన్ లో బర్త్ డే వేడుకలను ప్లాన్ చేశాడు. భారీగా అనుచరగణాన్ని కూడా పిలిపించుకున్నాడు. దీంతో వాహనదారులు భారీ ట్రాఫిక్ లో చిక్కుకుని 2 గంటలకుపైగా నరకం అనుభవించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేటలో నిన్న రాత్రి చోటుచేసుకుంది. ఈ వేడుకలు చేసింది మాత్రం పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు తనయుడు వికాశ్ కావడం విశేషం.
నిన్న వికాస్ పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేట చౌరస్తాలో భారీగా వేడుకలు ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున అనుచరగణం చేరుకోగా సాయంత్రం 5 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. రాత్రి 7 వరకూ సాగిన ఈ పుట్టినరోజు వేడుకల కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. స్కూలు నుంచి ఇళ్లకు వెళ్లే పిల్లలు, వాహనదారులు, సుదూర ప్రయాణాలు పెట్టుకున్నవారు లబోదిబోమని బాధపడ్డారు. ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అయితే మాత్రం ఇలా ట్రాఫిక్ ను ఆపేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఇంట్లో చేసుకోవాల్సిన వేడుకను ఇలా రోడ్డుపై చేసుకుని తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు విద్యార్థులు కూడా వైసీపీ నేత సుపుత్రుడి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.