IRAN: ఫొటోలు తీసిందట.. ఆస్ట్రేలియా ప్రొఫెసర్ కు పదేళ్ల జైలు శిక్ష విధించిన ఇరాన్!
- ఇరాన్ లోకి వచ్చిన ముగ్గురు ఆస్ట్రేలియన్లు
- నిషేధిత ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోల చిత్రీకరణ
- ప్రొఫెసర్ మూరేను దోషిగా నిర్ధారించిన కోర్టు
డ్రోన్లతో రహస్య ప్రాంతాలు, సైనిక స్థావరాలను ఫొటోలు, వీడియోలు తీసిన ముగ్గురు ఆస్ట్రేలియన్లపై ఇరాన్ కొరడా ఝుళిపించింది. వీరిలో ఓ ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు ఇంకా ఇరాన్ కస్టడీలోనే ఉన్నారు. గతేడాది జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్ బోర్న్ లో కైలీ మూరే గిల్బర్ట్ అనే మహిళ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది. గతేడాది ఆమెతో పాటు మరో జంట ఇరాన్ కు వచ్చింది. అక్కడే ఓ కోర్సులో కైలీ చేరింది. అయితే ఈ ముగ్గురు మరో దేశం కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఇరాన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
వీరి దగ్గరి నుంచి ఆర్మీ, ఇతర రహస్య స్థావరాలకు సంబంధించిన ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా అనుమతి లేకుండానే డ్రోన్లతో ఈ వీడియోలు, ఫొటోలను చిత్రీకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారించిన ఇరాన్ లోని ఓ కోర్టు, గూఢచర్యం కేసులో మూరే గిల్బర్ట్ ను దోషిగా నిర్ధారించింది. ఆమెకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇదిలావుంచితే, తమ పౌరులు ముగ్గురు అరెస్ట్ కావడంపై ఆస్ట్రేలియా సర్కారు స్పందిస్తూ.. ఇరాన్ ప్రభుత్వంతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. ఆస్ట్రేలియన్లు ఎవరూ ఈ పరిస్థితుల్లో ఇరాన్ కు వెళ్లద్దని సూచించింది. గిల్బర్ట్ మూరేకు బ్రిటన్, ఆస్ట్రేలియా పౌరసత్వాలు ఉన్నట్లు సమాచారం.