Crime News: హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.39 లక్షలకు టోకరా: నిందితుడు కూడా హోంగార్డే
- పదకొండు మంది నుంచి డబ్బు వసూలు
- వారికి బెల్టులు, గుర్తింపు కార్డు, డ్యూటీ పాస్‌లు మంజూరు
- తీరా స్టేషన్‌కి వెళ్లాక బయటపడిన మోసం
‘కంచే చేను మేసింది’ అన్న చందాన హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పదకొండు మంది వద్ద రూ.39 లక్షలు వసూలు చేసిన హోంగార్డు చేతివాటం ఇది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా యాదమరి మండలం పెరియంబాడి గ్రామానికి చెందిన ఎస్.నూర్‌మహ్మద్ చిత్తూరు ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని, పెద్దమొత్తం చెల్లిస్తే హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు.
దీంతో ఇతని మాటలు నమ్మిన కోణాపల్లి గ్రామానికి చెందిన నలుగురు, పెరియంబాడికి చెందిన నలుగురు, చిత్తూరులోని మురకంబట్టు, ఇరువారం, మిట్టూరుకు చెందిన మరో ముగ్గురు కలిసి మొత్తం 11 మంది ఇతన్ని సంప్రదించి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. దీంతో వారి నుంచి నూర్‌మహ్మద్ రూ.39 లక్షలు వసూు చేశాడు. కొన్నాళ్ల తరువాత ఉద్యోగాలు వచ్చేశాయని చెప్పి యూనిఫాం, టోపీ, బెల్ట్, గుర్తింపు కార్డు, డ్యూటీపాస్‌లు నకిలీవి తయారు చేసి ఇచ్చేశాడు.
నిజంగానే తమకు ఉద్యోగాలు వచ్చాయని నమ్మి స్టేషన్‌కు వెళ్లిన వీరికి షాక్ తగిలింది. జాబితాలో అసలు వారి పేర్లే లేవని తెలియడంతో జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు వివరించారు. విషయం తెలిసి నూర్‌మహ్మద్ పరారయ్యాడు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు యాదమరి ఎస్‌ఐ నిందితుడిని పెరియంబాడి క్రాస్‌రోడ్డు వద్ద నిన్న అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.