Andhra Pradesh: కోడెల నన్ను మేనల్లుడిలా, వాళ్ల అబ్బాయిలా ట్రీట్ చేసేవారు!: లగడపాటి రాజగోపాల్
- ఆయన ఓ పోరాట యోధుడు
- నా మేనమామతో కలిసి మెడికల్ కాలేజీలో చదువుకున్నారు
- ఆయనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు
తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు భౌతికకాయం ప్రస్తుతం గుంటూరులోని ఆయన నివాసంలో ఉంది. దీంతో కోడెలను కడసారి చూసేందుకు అభిమానులు, మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ క్రమంలో లోక్ సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈ రోజు కోడెల భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మరణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. కోడెలకు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఎవ్వరం ఊహించలేదని వ్యాఖ్యానించారు.
‘మేం కాలేజీలో ఉన్నప్పుడు కోడెల ఓ పోరాటయోధుడు. ఆయన ధైర్య సాహసాలకు మారుపేరు. కోడెల చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన నేత. నా మేనమామ, కోడెల ఇద్దరూ గుంటూరు మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. మా మేనమామకు కోడెల సన్నిహితుడు. దీంతో నన్నూ మేనల్లుడిలా, వాళ్ల అబ్బాయిలా ట్రీట్ చేసేవారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మేమిద్దరం తరచూ కలుస్తుండేవాళ్లం.
అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, అభయం ఇచ్చిన వ్యక్తి.. చివరికి మానసికంగా కుంగిపోయి, క్షోభను అనుభవించి ఈ విధంగా అందరికీ దూరమవడం చాలా బాధాకరమైన విషయం’ అని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. కోడెల ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.