Tamil Nadu: తండ్రి నుంచి డబ్బు కొట్టేసేందుకు కిడ్నాప్ డ్రామా...బెడిసి కొట్టిన కూతురి పథకం
- ప్రియుడి కోసం సినిమాటిక్ థీం
- పది లక్షల రూపాయలు డిమాండ్
- విచారణలో విషయం బయట పడడంతో కటకటాల వెనక్కి
ప్రియుడి మోజులో నిండా మునిగిపోయిన ఓ యువతి అతన్ని సంతృప్తిపరిచి చేతినిండా డబ్బుంచాలన్న ఉద్దేశంతో తండ్రి వద్ద కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. అయితే పథకం వికటించి పోలీసుల విచారణలో అసలు విషయం బయట పడడంతో కటకటాలు లెక్కిస్తోంది. పోలీసుల కథనం మేరకు...తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా పాపిరెడ్డి పట్టికి చెందిన ఆర్ముగం (51) తెలంగాణలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని కొడుకు విఘ్నేష్ (24) సిరుచ్చేరిలోని ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, కూతురు విద్య (22) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. ఈమె కారైక్కాల్‌కు చెందిన మనోజ్ అలియాస్ సురేష్‌బాబుతో ప్రేమలో పడింది.
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సురేష్‌కు రూ.10 లక్షలు అవసరమయ్యాయి. దీంతో విద్య అతనికో సలహా ఇచ్చింది. ఇటీవల స్థలం అమ్మగా వచ్చిన డబ్బు రూ.10 లక్షల సొమ్ము తన తండ్రివద్ద ఉందని, తనను కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడి, ఆ డబ్బు కొట్టేద్దామని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల విద్య తండ్రికి ఫోన్ చేసి తన స్నేహితురాలి సోదరి పెళ్లికి వెళ్తున్నట్లు చెప్పింది.
ఈ నెల 12న విద్యతో మాట్లాడేందుకు ఆర్ముగం ప్రయత్నించగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఆ తర్వాత గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ కుమార్తెను కిడ్నాప్ చేశామని, రూ.10 లక్షలు ఇచ్చి విడిపించుకుని వెళ్లాలని డిమాండ్ చేశాడు. అనంతరం విద్యతో కూడా మాట్లాడించారు. తనను దుండగులు కోయంబేడు బస్టాండ్ నుంచి అపహరించారని, చిత్రహింసలు పెడుతున్నారని భయంతో విద్య కూడా చెప్పడంతో ఆర్ముగం ఆందోళనకు గురయ్యాడు.
దీంతో కోయంబేడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన అక్కడి పోలీసులు పోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు కడలూరులో ఉన్నట్లు గుర్తించారు. వెళ్లి అతన్ని పట్టుకుని విచారించడంతో అసలు డ్రామా వెలుగులోకి వచ్చింది. విద్య, ప్రియుడు సురేష్‌బాబుతో కలిసి ఈ డ్రామాకు తెరలేపారని, విద్య ఆమె స్నేహితురాలు అక్షయ ఇంట్లో ఉందని గుర్తించారు. దీంతో ముగ్గురినీ అరెస్టు చేశారు.