Godavari: బిడ్డను, భర్తను కోల్పోయి.. గుండెలవిసేలా విలపించిన మధుమిత!
- నిన్న గోదావరిలో మునిగిన బోటు
- బిడ్డ కాళ్లు పట్టుకున్నా కాపాడుకోలేకపోయా
- ఆసుపత్రిలో మధుమిత రోదన
అప్పటివరకూ ఆనందంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగింది. బోటులో పెట్టిన శ్రావ్యమైన సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేస్తూ, డ్యాన్స్ చేస్తున్న తన కుమార్తెతో పాటు, కడవరకూ కలిసుంటానని బాసలు చేసిన భర్త కూడా కనిపించలేదు. దీంతో ఆమె రోదన హృదయ విదారకమైంది. నిన్న గోదావరిలో బోటు మునిగిపోగా, అదే బోటులో ప్రయాణించిన మధుమిత ఫ్యామిలీ గాధ ఇది.
తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ, బోటు ప్రమాదంలో చిక్కుకోగా, మధుమిత మాత్రమే ప్రాణాలు కాపాడుకోగలిగింది. పడవ మునిగిపోతున్న సమయంలో బిడ్డను, తనను కాపాడుకోవాలని భర్త ఎంతో ప్రయత్నించాడని, తనను, బిడ్డను పడవపైకి నెట్టారని, తన కాలును బిడ్డ పట్టుకున్నా ఆమె ప్రాణాలను కాపాడుకోలేకపోయానని మధుమిత, విలపిస్తూ చెబుతుంటే, విన్న వారందరి కళ్లూ చమర్చాయి.
తనను స్థానికులు కాపాడారని, భర్త, కూతురు హాసిని ఆచూకీ తెలియడం లేదని ఆమె విలపిస్తుంటే, ఓదార్చేందుకు ఎవరి వల్లా కాలేదు. ఇక ఆసుపత్రిలో తనను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ మంత్రి కన్నబాబుకు, జరిగిన ఘటన గురించి వివరిస్తూ, పడవ బోల్తా పడగానే తన భర్త, తనను, హాసినిని పైకి నెట్టాడని, ఆపై అతను మునిగిపోగా, తన కాలును పట్టుకున్న బిడ్డను తాను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.