yurenium: అనుమతులు ఇవ్వలేదు...భవిష్యత్తులో ఇవ్వం : యురేనియం తవ్వకాలపై మంత్రి కేటీఆర్ స్పష్టత
- బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలకు సమాధానం
- నల్గొండ జిల్లాలోనే నిక్షేపాల కోసం అన్వేషణ
- నాగర్కర్నూల్లో ఎటువంటి ప్రయత్నం జరగలేదు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాడివేడి చర్చ జరుగుతున్న యురేనియం నిక్షేపాల వెలికితీత అంశంపై ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. నల్లమలలో నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా ఇవ్వమని తెలియజేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టిన విషయం వాస్తవమేనని తెలిపారు. కానీ నాగర్కర్నూల్-అమ్రాబాద్ ప్రాంతాల్లో ఎటువంటి అన్వేషణ చేపట్టలేదని వివరించారు. ఆయా ప్రాంతాల్లో నిక్షేపాలు ఉన్నప్పటికీ వాటిని తవ్వి తీసేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వమని వన్యప్రాణుల సంరక్షణ విభాగం ఇదివరకే చేసిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.