Andhra Pradesh: ఏపీలో నాణ్యత లేని పశువుల ఔషధాలు.. అధికారులపై సీఎం జగన్ కన్నెర్ర!
- వచ్చే నెల రైతులకు భరోసా, సబ్సిడీ నిధులిస్తాం
- కరవుతో అల్లాడినవారికి ఊరట కలుగుతుంది
- ఏపీ వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీలు విడుదల చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. దీనివల్ల కరవు కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులకు ఊరట లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో తృణధాన్యాల సాగు పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అదే సమయంలో ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరముందని చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ‘వ్యవసాయ మిషన్’పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తృణధాన్యాలకు గిట్టుబాటు ధర వచ్చేలా అధికారులు చూడాలని ఆదేశించారు. అదే సమయంలో ఏపీలో టమోటా పంట ధర పడిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పశువుల కోసం వినియోగిస్తున్న మందుల్లో నాణ్యత ఉండటం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, నాణ్యత ఉండే మందులనే వాడాలని స్పష్టం చేశారు. ఏపీలోని వ్యవసాయరంగంలో పరిస్థితులపై శ్వేతపత్రం తయారుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.