Amit Shah: అమిత్ షా ‘హిందీ’ వ్యాఖ్యలపై మండిపడ్డ స్టాలిన్.. భారత్ ముక్కలు అవుతుందని వైగో వార్నింగ్!
- దేశంలో ఒకే భాష హిందీ ఉండాలన్న షా
- అప్పుడే భారత్ ఐక్యంగా ఉంటుందని వ్యాఖ్య
- తన వ్యాఖ్యలను షా వెనక్కి తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్
భారత్ లో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారతీయులంతా హిందీ వాడకాన్ని ప్రోత్సహించాలని షా పిలుపునిచ్చారు. తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెన్నైలో ఘాటుగా స్పందించారు. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు చేసిన వ్యాఖ్యలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు.
ఇలాంటి వ్యాఖ్యలతో భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కాబట్టి తన వ్యాఖ్యలను షా వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి తాము డీఎంకే కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నామనీ, అందులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. మరోవైపు తమిళ నేత వైగో సైతం షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. హిందీ భాషను జాతీయస్థాయిలో దేశమంతా రుద్దాలనుకోవడం మూర్ఖత్వమని విమర్శించారు. అదే జరిగితే హిందీ భాషను వద్దనుకునే రాష్ట్రాలు భారత్ లో ఉండవని తీవ్ర హెచ్చరికలు చేశారు. హిందీని జాతీయ భాషగా చిత్రీకరించడం దేశానికి శాపమని వ్యాఖ్యానించారు.