Maharashtra: అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు ఆగిపోయిన గణేశ్ శోభాయాత్ర.. వీడియో వైరల్!
- మహారాష్ట్రలోని పూణేలో ఘటన
- అస్వస్థతకు లోనైన వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్
- అంబులెన్స్ కు దారి ఇచ్చాక మళ్లీ శోభాయాత్ర ప్రారంభం
సాధారణంగా భారీ ఊరేగింపులు సాగుతున్నప్పుడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తారు. కానీ కొన్నిసార్లు మాత్రం అనుకోని ఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అలాంటప్పుడు ప్రజలు వ్యహరించేతీరుపైనే బాధితుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. తాజాగా అలాంటి ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది.
పూణేలోని లక్ష్మీ రోడ్డులో నిన్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే ఎవరికో అనారోగ్యం తలెత్తడంతో అంబులెన్సు సదరు రోగిని ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరింది. లక్ష్మీరోడ్డుకు చేరుకునేసరికి భారీఎత్తున ఊరేగింపు సాగుతోంది. దీంతో అంబులెన్సు ముందుకు వెళ్లేందుకు దారి కనిపించలేదు. అయితే వెనుక అంబులెన్సును గమనించిన ప్రజలు మానవత్వంతో వ్యవహరించారు.
వెంటనే అందరినీ తప్పుకోవాల్సిందిగా కోరుతూ దారిని కల్పించారు. దీంతో అంబులెన్సు వెళ్లేందుకు రోడ్డు క్లియర్ అయింది. అంబులెన్సు వీరిని దాటి వెళ్లగానే శోభాయాత్ర యథావిధిగా ముందుకు సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఊరేగింపు సందర్భంగా పూణేవాసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.