Tamilnadu: చెన్నైలో 'లాన్స్ టయోటా' డీలర్ రీటా ఆత్మహత్య!
- యువ మహిళా పారిశ్రామిక వేత్తగా పేరు తెచ్చుకున్న రీటా లంకా లింగం
- ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిన కార్ల అమ్మకాలు
- తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం
తమిళనాడులో యువ మహిళా పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకుని, లాన్స్ టయోటా కార్స్ డీలర్ షిప్ సంస్థకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రీటా లంకా లింగం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. చెన్నై, నుంగంబాక్కం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, లాన్స్ టయోటా కార్లకు లంకా లింగం ప్రధాన డీలర్ గా, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండగా, ఆయన భార్య రీటా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. నుంగంబాక్కం ప్రాంతంలో అతిపెద్ద నివాస గృహం వీరిదే.
నిత్యమూ ఉద్యం 8 గంటలకల్లా కార్యాలయానికి వెళ్లిపోయే ఆమె, నిన్న 11 గంటలైనా గదిలోంచి బయటకు రాలేదు. దీంతో ఇంట్లో పనిమనిషి ఏసుపాదం, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి, గది తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ, మృతి చెందిన స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కాగా, గత కొంత కాలంగా కార్ల వ్యాపారం మందగించడంతో, నష్టాలు వచ్చిన నేపథ్యంలో, ఆమె తీవ్ర మనో వేదనతో ఉన్నట్టు విచారణలో తేలింది. వారికి ఏమైనా అప్పులు ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ ప్రారంభించారు. రీటా ఆత్మహత్యపై కొందరు బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో, ఆ దిశగానూ విచారణ జరుపుతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.