Tirumala: తిరుమలలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానం... రంగంలోకి దిగిన ఆక్టోపస్!
- దక్షిణాదిపై దాడులకు అవకాశం ఉందని హెచ్చరికలు
- ఇంటెలిజెన్స్ సూచనలతో అప్రమత్తమైన టీటీడీ
- బృందాలుగా ఏర్పడి జల్లెడ పడుతున్న ఆక్టోపస్
ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని, దక్షిణాదిలో ఎప్పుడైనా, ఎక్కడైనా దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తిరుమలలో ఉగ్రదాడులు జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుమలలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానంతో ఆక్టోపస్ బృందం రంగంలోకి దిగింది.
మొత్తం 40 మంది కమాండోలు తిరుమలను జల్లెడ పడుతున్నారు. ముష్కరులను ఎదుర్కోవడంలో కఠోర శిక్షణ పొందిన వీరు అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీని వినియోగించి సామాన్య భక్తులకు, ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో నేర్పరులు. తిరుమల కొండకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, టీటీడీ వినతి మేరకు ఆక్టోపస్ కమాండో బృందాలు వచ్చి, ప్రస్తుతం నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.
ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆలయ పరిసరాలతో పాటు తిరుమల మొత్తం వీరు తిరుగుతున్నారు. కొన్ని బృందాలుగా విడిపోయి, అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతాన్నీ తనిఖీ చేస్తున్నారు. ఆలయం వద్ద నిరంతర నిఘా ఉంచుతున్నారు. నలుపురంగు దుస్తుల్లో ఆయుధాలు ధరించి, కాళ్లకు షూస్ లేకుండా తిరుమల మాడ వీధుల్లో తిరుగుతున్న కమాండోలను చూసేందుకు భక్తులు సైతం ఆసక్తి చూపుతున్నారు.