Chinthamaneni Prabhakar: బొత్సకు చింతమనేని సవాల్!
- చింతమనేని తప్పు చేయలేదా? అని బొత్స అన్నారు
- తప్పు చేశానని నిరూపిస్తే నా ఆస్తిని పేదలకు దానం చేస్తా
- విజయసాయిరెడ్డి మీద ఉన్నన్ని కేసులు మరెవరి మీదా లేవు
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు. చింతమనేని తప్పు చేయలేదా? అని బొత్స అన్నారని... తాను తప్పు చేసినట్టు బొత్స నిరూపిస్తే తన తండ్రి ఆస్తిని, తన ఆస్తిని పేదలకు దానం చేస్తానని... రుజువు చేయలేకపోతే మంత్రి పదవికి బొత్స రాజీనామా చేస్తారా? అని ఛాలెంజ్ చేశారు. తనపై మెజిస్టీరియల్ విచారణ కూడా అవసరం లేదని... గ్రామ సభ పెట్టి తాను తప్పు చేసినట్టు నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై చింతమనేని సెటైర్లు విసిరారు. విజయసాయిరెడ్డి మమ్మల్ని దొంగలంటున్నారని... ఆయనేమో దొరట అని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి మీద ఉన్నన్ని కేసులు మరెవరి మీదా లేవని అన్నారు. తాను బయటకు వస్తున్నట్టు ముందే ప్రకటించానని... కానీ, తనను పట్టుకుంటున్నట్టు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. 12 పోలీసు బృందాలను పెట్టినా 14 రోజుల పాటు తనను ఎవరూ పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.