vinayaka laddu: గణేశ్ లడ్డూ 5.4 లక్షలు...పూజకు ఉంచిన ఐదు వెండి నాణాలు రూ.5.5 లక్షలు

  • అమీన్‌పూర్‌ వినాయకుడి ప్రసాదానికి రికార్డు స్థాయి ధర
  • బీరంగూడ శివాలయం చౌరస్తా మండపంలో వేలం
  • లడ్డూను దక్కించుకున్న స్థిరాస్తి వ్యాపారి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పట్టణం బీరంగూడ శివాలయం చౌరస్తాలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో గణపతికి నివేదించిన లడ్డూ ప్రసాదం, పూజకు ఉంచిన ఐదు వెండి నాణాలు వేలంలో రికార్డు స్థాయి ధర పలికాయి. ఈ వేలం పాట ద్వారా మొత్తంగా నిర్వాహకులకు 10.9 లక్షల రూపాయలు సమకూరాయి. మండపం వద్ద నిన్న రాత్రి నిర్వహించిన వేలం పాటలో స్థిరాస్తి వ్యాపారి రాంరెడ్డి ఐదు లక్షల 40 వేల రూపాయలకు లడ్డూను వేలం పాడారు. గత ఏడాది కూడా రాంరెడ్డే ఇక్కడి లడ్డూను రూ.5 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు.

కాగా, స్వామి వారి పూజకు ఉంచిన 20 గ్రాముల వెండి నాణాలకు కూడా వేలంలో రికార్డు ధర పలికింది. తొమ్మిది రోజులపాటు గణపతి పూజలో ఉంచిన నాణాలు కావడంతో భక్తులు వేలంలో దక్కించుకునేందుకు ఆసక్తి చూపించారు. మొదటి దానిని మధు రూ.1.8 లక్షలకు, రెండోది తన్నీరు ఏడు కొండలు రూ.లక్షకు, మూడోది వీరారెడ్డి రూ.80 వేలకు, నాలుగోది వెంకటరావు రూ.88 వేలకు, ఐదో నాణాన్ని రూ.1.10 లక్షలకు బ్రహ్మయ్య సొంతం చేసుకున్నారు.

కాగా, దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట హనుమాన్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ మండపం వద్ద మంగళవారం నిర్వహించిన వేలం పాటలో లడ్డూను రూ.7 లక్షలకు స్థానికుడు సర్గారి రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఇక్కడి లడ్డూ 5.5 లక్షలు పలకగా, ఈసారి డిమాండ్‌ పెరిగింది.

vinayaka laddu
silver coins
highest value
Sangareddy District
ameenpur
  • Loading...

More Telugu News