Jagan: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్
- విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు ఎక్కడా లేదు
- ఆధారాలు లేకుండానే పీపీఏలను రద్దు చేయాలని కోరుతున్నారు
- ఏపీ వైఖరి దేశ వ్యాప్తంగా పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏలు) భారీ అవినీతి చోటు చేసుకుందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పీపీఏలపై సమీక్ష కూడా నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, పీపీఏలపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ విమర్శించారు. విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవని తెలిపారు. సరైన ఆధారాలు లేకుండానే పీపీఏలను రద్దు చేయాలని కోరుతున్నారని చెప్పారు. కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినిపించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
బాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగాయంటూ లేఖ పట్టుకుని గతంలో జగన్ ఢిల్లీకి వచ్చారని ఆర్కే సింగ్ తెలిపారు. పవర్ ప్రాజెక్టులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దేశ వ్యాప్తంగా పెట్టుబడులపై ప్రభావం చూపుతోందని అన్నారు. జగన్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేశామని... త్వరలోనే పీపీఏల వివాదం సద్దుమణుగుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.