Andhra Pradesh: అచ్చెన్నా.. నీ అవినీతిని ఆధారాలతో బయటపెడతా.. దమ్ముంటే చర్చకు రా!: వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ సవాల్
- అచ్చెన్నాయుడు కమీషన్లు దండుకున్నారు
- జగన్ పై ఆయన విమర్శలు చేయడం విడ్డూరం
- శ్రీకాకుళంలో మీడియాతో వైసీపీ నేత
తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడిపై వైసీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ సహా అన్నింటిలో అచ్చెన్నాయుడు కమిషన్లు దండుకున్నారని ఆయన విమర్శించారు. అలాంటి అవినీతిపరుడైన వ్యక్తి ఈరోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారనీ, నవరత్నాలను విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు.
ప్రభుత్వ అధికారులపై బెదిరింపు, ఎస్సీ కులస్తుడిపై దాడి చేసిన కేసులో అచ్చెన్నాయుడు ఇంకా కోర్టులకు హాజరవుతున్నారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. నిమ్మాడలో తన మాట వినని ప్రజలను గ్రామ బహిష్కరణ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. అక్రమ మైనింగ్, శాండ్, వైన్స్, ధాన్యం, మినుములు అన్నింటిలో దోపిడీకి పాల్పడ్డ అచ్చెన్న అవినీతిపరుడిగా గుర్తింపు పొందాడని ఎద్దేవా చేశారు.
‘నీ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతా. దమ్ముంటే బహిరంగ చర్చకు రా. తేదీ, వేదిక నువ్వు చెప్పు’ అని సవాల్ విసిరారు. అలాగే ఎన్నికల్లో 12 పోలింగ్ బూత్ లను రిగ్గింగ్ చేసి భయపెట్టి గెలవడం గొప్ప విషయం కాదని శ్రీనివాస్ అన్నారు. ఎక్కడో ఒకచోట తడిసిన బియ్యాన్ని పట్టుకుని దాన్ని హైలైట్ చేయడం టీడీపీ నీచ రాజకీయాలకు పరాకాష్ఠ అని శ్రీనివాస్ విమర్శించారు.