mumbai tardeo road: అక్కడ చదరపు అడుగు నివాస స్థలం ధర రూ.56,200 : అత్యంత ఖరీదైన ప్రాంతం తార్దేవ్ రోడ్డు
- దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ప్రాంతం ఇది
- మొదటి మూడు స్థానాలు ఈ నగరానివే
- ఆ తర్వాత చెన్నై...ఆరో స్థానంలో ఢిల్లీ
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చదరపు అడుగు నివాస ప్రాంతం కావాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా.. అక్షరాలా 56,200 రూపాయలు. ముంబయి మహానగరంలోని తార్దేవ్ రోడ్డు ప్రాంతం దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతమని ప్రైమరీ మార్కెట్ ఆధారంగా నిర్థారించారు. అంటే ఇక్కడ మీరు వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ కొనాలంటే దాదాపు రూ.6 కోట్లు ఖర్చుచేయాలన్నమాట.
స్థిరాస్తి సలహా సంస్థ ఆన్‌రాక్ దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో తేలిన విషయమిది. ప్రాథమిక స్థిరాస్తి రంగంగా పరిగణించే ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన ఫ్లాట్ల ధరల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. మొదటి మూడు స్థానాలలోని ప్రాంతాలు ముంబయిలోనే ఉండగా, ఆ తర్వాత రెండు స్థానాలు తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఈ విషయంలో ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. విలాసవంతమైన నివాస భవనాలు, ఉన్నత ప్రమాణాలుగల ఆసుపత్రులు, విద్యా సంస్థలు, హోటళ్లు ఉండడమే తార్దేవ్ రోడ్డులో ఇళ్లకు అంత గిరాకీ అని అధ్యయన సంస్థ తేల్చింది.
ముంబయిలోనే వర్లి ప్రాంతం చదరపు అడుగు ధర 41,500 రూపాయలతో రెండో స్థానం, ఇదే నగరంలోని మహాలక్ష్మి నగర్ ప్రాంతం రూ.40 వేలతో మూడో స్థానంలో నిలిచాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముంబయిలోని నివాస ప్రాంతాల ధరకు, ఇతర నగరాల్లోని ధరకు మధ్య వ్యత్యాసం రెండున్నర రెట్లు అధికంగా ఉండడం.
తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలోని నుంగంబాక్కం ప్రాంతం దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో నాల్గో స్థానం దక్కించుకున్నా ఇక్కడ చదరపు అడుగు ధర 18 వేల రూపాయలు మాత్రమే. ముంబయి ధర కంటే దాదాపు ఒకటిన్నర రెట్లు తక్కువ.
చెన్నై నగరంలోని ఎగ్మోర్ రూ.15,100 ధరతో ఐదో స్థానంలో నిలవగా, దేశరాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో చదరపు అడుగు నివాస ప్రాంతం 13,500 రూపాయలు పలుకుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రూ.13 వేలతో అన్నానగర్ (చెన్నై), రూ.12,500తో కోరేగాం పార్క్ (పుణె), రూ.12,500తో గోల్ఫ్‌కోర్స్ రోడ్డు (గుర్గాం), రూ.11,800తో అలీపుర్ (కోల్‌కతా) నిలిచాయి.